జనగళం 24 ఆంధ్ర డెస్క్: రాబోయే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యాచరణను వేగవంతం చేసింది. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని)తో పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై ఇరువురు నేతలు సుమారు గంటపాటు విస్తృతంగా చర్చించారు.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ పటిష్టత, ప్రజాబలం, స్థానిక సమస్యలపై ప్రజల్లో ఉన్న స్పందనను నేతలు సమీక్షించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న క్రియాశీల నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని నిర్ణయించారు. కూటమి నేతలు, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు
