జన గళం కృత్తివెన్ను బ్యూరో: కృష్ణా జిల్లా కృత్తివెన్ను శివారు అడ్డపర్ర (వాలంక తూము దగ్గర) వెలసిన శ్రీ చక్రస్థిత వనదుర్గా మహాలక్ష్మి సమేత శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు పది రోజుల పాటు అమ్మవారి విశేష దివ్య అలంకారాలతో జరగనున్న ఈ మహోత్సవాల తొలి రోజైన ఆదివారం ఉదయం ఆలయంలో కలశస్థాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తా నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో శ్రీ కూనపాని నాగబాబు, శిరీష దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, హోమ క్రతువుల నడుమ కలశస్థాపన జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ దినాల్లో భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కావాలని శ్రీ దేవి భక్త బృందం కోరింది.
కృత్తివెన్నులో ఘనంగా శరన్నవరాత్రులు ప్రారంభం: కూనపాని నాగబాబు దంపతుల కలశస్థాపన పూజలు!
Slug: kruthivennu-addaparra-kanaka-durga-temple-dasara-navaratri-kalasa-sthapana-kunapani-nagababu
