జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: మచిలీపట్నం నగర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ వ్యూహాన్ని జనసేన పార్టీ నాయకులు కోన నాగార్జున ముందుగానే అంచనా వేశారని కోన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ స్థానం ఓసీ జనరల్ కేటగిరీకి కేటాయించినప్పటికీ, వైఎస్సార్‌సీపీ తరఫున మహిళను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని కేఎన్ఎస్ (KNS) సర్వే ద్వారా కోన నాగార్జున ముందుగానే స్పష్టం చేసినట్లు వారు పేర్కొన్నారు.
అక్టోబర్ 11న పేర్ని నాని అధికారికంగా మహిళా అభ్యర్థిని మేయర్ రేసులోకి ప్రకటించడంతో కోన నాగార్జున చేసిన ముందస్తు అంచనా నిజమైందని కోన కార్యాలయం వెల్లడించింది. అభ్యర్థి ఎంపికపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోకముందే ఈ రాజకీయ పరిణామాన్ని కోన నాగార్జున కచ్చితంగా ఊహించారని తెలిపారు. ఆలోచనను ముందుగానే చెప్పిన తమ్ముడు కోన నాగార్జున అని, దానిని అమలు చేసిన అన్నయ్య పేర్ని నాని అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మచిలీపట్నం నగర పరిధిలోని స్థానిక రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని కోన కార్యాలయం తెలిపింది. ప్రజల అభిప్రాయాలను మరియు రాజకీయ వ్యూహాలను కేఎన్ఎస్ సర్వేల ద్వారా విశ్లేషిస్తూ ముందస్తు అంచనాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని పేర్కొంది. రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో మచిలీపట్నం మున్సిపల్ రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారనుందని స్థానిక విశ్లేషకులు భావిస్తున్నారు.
