జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రిజర్వేషన్ల ముసాయిదా వెలువడుతున్న క్రమంలో కూటమి ప్రధాన భాగస్వాముల మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేసేందుకు కీలక అడుగు పడింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా ఏకాంతంగా సాగిన ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల విధివిధానాలు, రాజకీయ ప్రభావాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఖరారైన రిజర్వేషన్లపై వస్తున్న రాజకీయ చర్చల నేపథ్యంలో టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్‌కు పూర్తి వివరాలు నివేదించారు. ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం, అత్యంత శాస్త్రీయ దృక్పథంతో రిజర్వేషన్లను నిర్ధారించినట్లు స్పష్టం చేశారు. ఎక్కడా రాజకీయ ప్రమేయం లేకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జనాభా ప్రాతిపదికన మాత్రమే కేటాయింపులు జరిగాయని వివరించారు.
ఈ సమావేశంలో రిజర్వేషన్ల అంశంతో పాటు రాబోయే స్థానిక పోరులో ఉమ్మడి కార్యాచరణ, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కూడా విస్తృతంగా సంప్రదింపులు జరిగాయి. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య సంపూర్ణ సమన్వయం సాధించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించేలా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు సమాలోచనలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు జడ్పీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలోనే ఉమ్మడిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
