జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మడ అడవుల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టే బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఈ తీర ప్రాంతంలో సుమారు మూడు లక్షల మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్, శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు నియోజకవర్గానికి విచ్చేశారు. పర్యటనకు విచ్చేసిన నాగబాబుకు స్థానిక నాయకులు, జనసేన శ్రేణులు అత్యంత ఉత్సాహంతో ఘన స్వాగతం పలికారు.
సముద్ర తీర ప్రాంతాలను తుపాన్లు, కోత నుంచి రక్షించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని, పర్యావరణ సమతుల్యత కోసం వీటి పెంపకం అత్యంత ఆవశ్యకమని నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇంతటి ప్రతిష్టాత్మక హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు చొరవ చూపిన స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, యువనేత మండలి రాజబాబులకు స్థానిక ప్రతినిధులు, కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
