జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల లెక్కింపునకు సంబంధించి ప్రభుత్వం అధికారిక నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవుల కేటాయింపునకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదని స్పష్టం చేస్తూ సీలింగ్ పరిమితిని అమలులోకి తెచ్చింది. ఒకవేళ మొత్తం రిజర్వేషన్ల శాతం యాభై దాటితే ఆ అదనపు శాతాన్ని బీసీ కోటా నుంచే తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది.
మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని కేటగిరీలైన ఎస్టీ, ఎస్సీ, బీసీ మరియు అన్‌రిజర్వ్‌డ్ స్థానాల్లో మహిళలకు ఖచ్చితంగా యాభై శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్ల ఖరారు క్రమంలో తొలుత ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు, అనంతరం మిగిలిన స్థానాల ఆధారంగా బీసీలకు కేటాయింపులు చేయనున్నారు. ఈ బాధ్యతలను క్షేత్రస్థాయి అధికారులకు అప్పగిస్తూ వార్డు సభ్యుల స్థానాలను ఎంపీడీవో, సర్పంచ్ మరియు ఎంపీటీసీ స్థానాలను ఆర్డీవో, జడ్పీటీసీ మరియు ఎంపీపీ పదవుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
