జన గళం : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ శ్రేణుల ప్రచారం సరికొత్త ఊపందుకుంటోంది. పగిలిన గ్లాసు అంటే ఓటిది కాదని, పగిలిన కొద్దీ దానికి పదును మరింత పెరుగుతుందని, ఎదురొస్తే గాయం తప్పదంటూ పార్టీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును ఉద్దేశించి ప్రత్యర్థుల విమర్శలకు గట్టి సమాధానమిచ్చేలా వైరల్ అవుతున్న ఈ నినాదం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
గతంలో ఎదురైన ఒడిదుడుకులు, రాజకీయ సవాళ్లను అధిగమించి కూటమి ప్రభుత్వంలో కీలక శక్తిగా ఎదిగిన ప్రయాణాన్ని కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. పార్టీని తక్కువగా అంచనా వేసే ప్రయత్నం చేస్తే తాము మరింత ఉధృతంగా పోరాడతామని శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో క్యాడర్లో సరికొత్త జోష్ నింపేలా సాగుతున్న ఈ ప్రచారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
