జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నగారా మోగిన నేపథ్యంలో జనసేన పార్టీ తన ఎన్నికల వ్యూహాలను మరింత పదును పెట్టింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక సమన్వయ కమిటీని (కో-ఆర్డినేషన్ కమిటీ) అధికారికంగా నియమించారు.
ఈ కమిటీలో ప్రధాన సమన్వయకర్తలుగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, సీనియర్ నాయకులు అమ్మిశెట్టి వాసులకు కీలక బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు 32 మంది సభ్యులతో కూడిన విజయవాడ పార్లమెంటు నిర్వాహక దళ్, మరో ఐదుగురు సభ్యులతో సపోర్ట్ టీమ్ను కూడా నియమించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు ఈ కమిటీ పనిచేయనుంది.
