జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ రాజకీయ యవనికపై సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ప్రజా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా వారసుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకులు, విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. సిద్ధాంతాలే పునాదిగా, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో వంగవీటి రాధాకృష్ణ భాగస్వామ్యం కావడం బెజవాడ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెను మార్పులకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే రాధాకృష్ణ నాయకత్వం విజయవాడ నగర అభివృద్ధికి, జనసేన పార్టీ విస్తరణకు ఎంతో దోహదపడుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ సమాయత్తమవుతున్న ఈ కీలక సమయంలో వంగవీటి రాధా రాక కేడర్లో సరికొత్త జోష్ నింపిందని అమ్మిశెట్టి వాసు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని డివిజన్లు, నియోజకవర్గాల్లో కూటమి ఐక్యతతో, ప్రజా మద్దతుతో అఖండ విజయం సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జనసేన కుటుంబంలోకి ప్రవేశించిన రాధాకృష్ణకు పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతుగా నిలుస్తాయని పునరుద్ఘాటించారు.
