జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గ్రామీణ మహిళల ప్రతిభ, నైపుణ్యాలకు జాతీయ సరస్ మేళా-2026 అసలైన వేదికగా నిలుస్తోందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను ప్రారంభించారు.
మహిళలు తమ దృఢ సంకల్పంతో ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలరని, మహిళా సాధికారతే దేశాభివృద్ధికి మూలస్తంభమని రాష్ట్రపతి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి, వారిని ఆర్థికంగా నిలబెట్టడంలో సరస్ మేళా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సుమారు 650 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ చేతివృత్తులు, హస్తకళల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు కేవలం మేళాలకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా మార్కెటింగ్ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు.
