విజయవాడ, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం జనసేనకు.. రాజమండ్రి బీజేపీ పరం
జన గళం బ్యూరో, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం తుది దశకు చేరింది. మూడు పార్టీల మధ్య సఖ్యతను కాపాడుతూ, క్షేత్రస్థాయి బలాబలాలు, గత సాధారణ ఎన్నికల ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుని మున్సిపల్ పీఠాల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రతిష్ఠాత్మక మున్సిపల్ కార్పొరేషన్లు, 17 మున్సిపాలిటీలు దక్కాయి. రాజకీయంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ నగర కార్పొరేషన్తో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని కాకినాడ, ఏలూరు మరియు ఉత్తరాంధ్ర కీలక కేంద్రమైన శ్రీకాకుళం నగరపాలక సంస్థల మేయర్ స్థానాలు జనసేనకు కేటాయించారు. మరో మిత్రపక్షమైన బీజేపీకి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీలను కేటాయించేలా అంగీకారం కుదిరింది. మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో టీడీపీ నేతృత్వంలో కూటమి బరిలోకి దిగనుంది.
పార్టీల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు తలెత్తకుండా సమష్టి నాయకత్వంతో ఎన్నికలను ఎదుర్కోవాలని కూటమి పెద్దలు దిశానిర్దేశం చేశారు. సీట్ల కేటాయింపు కొలిక్కి రావడంతో ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కసరత్తును మరింత వేగవంతం చేయనున్నారు.
