జన గళం రాజకీయ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం సమీపిస్తున్న వేళ విజయవాడ పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ సమన్వయ కమిటీని ప్రకటించిన నేపథ్యంలో నగర పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీకి జనసేన పార్టీ విజయవాడ నగర నాయకులు గుండు రాము ప్రత్యేకంగా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్లు, పంచాయతీల్లో పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించేందుకు ఈ సమన్వయ కమిటీ కీలకంగా వ్యవహరించనుందని పేర్కొన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో జనసేన జెండాను రెపరెపలాడించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను సహా కమిటీ సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
