జన గళం రాజకీయ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ విజయవాడ నగరంలో రాజకీయ సందడి మరింత వేడెక్కింది. విజయవాడ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు, జనసేన పార్టీ సీనియర్ నేత శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని ఈ రోజు పలువురు పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ గారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నగరపాలక సంస్థ డివిజన్లు, గ్రామీణ స్థానిక సంస్థల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, కార్యకర్తల సమన్వయంపై ఆయనతో చర్చించారు. పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని వంగవీటి రాధాకృష్ణ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.
