జన గళం ఆధ్యాత్మిక డెస్క్: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వేళ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల కానుకలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ భక్తులు అమ్మవారికి సుమారు రూ. 75 లక్షల విలువైన 494 గ్రాముల నవరత్న ఖచిత స్వర్ణ కిరీటాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు.
శ్రీకాకుళం వాస్తవ్యులు కూర్మినాయుడు, శ్రీమతి పద్మావతమ్మ దంపతుల కుమారుడు శ్రీ కె. దుర్గా శ్రీనివాస్ నాయుడు ఈ అద్భుతమైన కానుకను బహూకరించారు. ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఈ నవరత్న కిరీటాన్ని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు. అనంతరం దాతలకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
