అమరావతి: రాజకీయాల్లో అధికారం వచ్చాక చుట్టూ చేరే వారికంటే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిలబడే నిజమైన కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత దక్కాలనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. “గెలిచాక శాలువా కప్పే వాడి కన్నా.. గెలవడం కోసం జెండా మోసిన కార్యకర్తకే ప్రాధాన్యత ఇవ్వాలి” అనే నినాదం సోషల్ మీడియా వేదికల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఎన్నికల సమయంలో ఎండనక, వాననక పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓట్లు వేయించి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించేది కార్యకర్తలేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. విజయం సాధించిన తర్వాత పదవులు, సత్కారాల కోసం ముందుకొచ్చే అవకాశవాదుల కంటే.. కష్టకాలంలో జెండా మోసి పోరాడిన సాధారణ కార్యకర్తలను, సైనికులను గుర్తించి గౌరవించినప్పుడే ఏ రాజకీయ పార్టీకైనా బలమైన పునాది, దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటాయని కేడర్ అభిప్రాయపడుతోంది.
