జన గళం సినిమా బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో అజరామరమైన కళాఖండంగా నిలిచిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రం విడుదలై నేటితో (09.10.1992 – 09.10.2026) విజయవంతంగా 34 వసంతాలు పూర్తి చేసుకుంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఓ అరుదైన ఆణిముత్యం. మాస్ ఇమేజ్ శిఖరాగ్రంలో ఉన్న సమయంలోనూ నటనకు పెద్దపీట వేస్తూ ‘మాధవ’ పాత్రలో చిరంజీవి చూపించిన అభినయం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా మీనా అద్భుత నటనను కనబరచగా, ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన సంగీతం నేటికీ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. ‘చిరంజీవించిన చిత్రం’గా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నేరుగా 50 రోజులు ప్రదర్శితమై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో అద్వితీయ నటనకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. చిత్రం 34 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
Slug: aapadbandhavudu-movie-34-years-chiranjeevi-k-viswanath
