హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్-II పనుల పురోగతిపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో శ్రీనివాసపురం రిజర్వాయర్ టెండర్ ప్రక్రియ మరియు పనుల గురించి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. HNSS ఫేజ్-II మిగిలిన పనుల కోసం ఇప్పటికే రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైన నేపథ్యంలో, పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులను 2027 నాటికి పూర్తి చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లికి స్పష్టం చేశారు.
రాయచోటి నియోజకవర్గంలో పనుల వేగవంతం రాయచోటి నియోజకవర్గ పరిధిలోని HNSS మెయిన్ కెనాల్ (కిమీ 490-535 వరకు) పనులను సుమారు రూ.350 కోట్లతో సమగ్రంగా చేపట్టాలని సీఎం సూచించారు. ఈ పనులు పూర్తయితే HNSS ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలు తీరడంతో పాటు సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుందని, అలాగే ఖాళీ చెరువులను నింపి ప్రజలకు నీటి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి మండిపల్లి తెలిపారు.
శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను HNSS కెనాల్‌తో అనుసంధానం చేసి, మార్గమధ్యంలోని చెరువులను నింపేలా ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
SLUG: AP CM Chandrababu Naidu directs Minister Mandipalli Ramprasad Reddy to complete HNSS phase-II and Srinivasapuram reservoir works by 2027.
