జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: అన్నమయ్య జిల్లా రాజంపేట పురపాలక సంఘం ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు, ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగక ముందే స్థానికంగా పదవుల వేట మొదలైంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలోకి చేరిన కొందరు వలస నాయకులు, స్థానిక టీ దుకాణాల వద్ద కూర్చుని పురపాలక అధ్యక్ష పీఠం కోసం పావులు కదుపుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎలాంటి ప్రజాబలం గానీ, ఆర్థిక స్తోమత గానీ లేని కొందరు నేతలు స్థానిక కూడళ్ల వద్ద బృందాలుగా ఏర్పడి రాబోయే ఎన్నికల్లో పురపాలక పీఠం తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వీరు కేవలం ఒక్క పార్టీకే పరిమితం కాకుండా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో పాటు పూర్వ పార్టీ అయిన వైకాపా నాయకత్వంతోనూ సమాంతరంగా చర్చలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పార్టీ నుంచి టికెట్ లభిస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తూ, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అవకాశవాద రాజకీయాలకు తెరతీశారని స్థానిక వర్గాలు మండిపడుతున్నాయి.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాలు మోసి, పోలీసు కేసులు ఎదుర్కొని నిలబడిన అసలైన కార్యకర్తలను విస్మరించి, నిన్నగాక మొన్న చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తే సహించేది లేదని పాత కేడర్ హెచ్చరిస్తోంది. అధికారం రాగానే అడ్డదారిలో పదవులు దక్కించుకోవాలని చూస్తున్న ఇలాంటి నాయకుల కదలికలపై నిఘా ఉంచాలని కోరుతున్నారు. పార్టీ అధిష్టానం మరియు నియోజకవర్గ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి, పార్టీని నమ్ముకున్న విశ్వసనీయ కార్యకర్తలకే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని స్థానిక శ్రేణులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి
