జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త ప్రజా పాలనను అందిస్తూ ఆధ్యాత్మిక రంగంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మరియు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పి.వి. ఫణి కుమార్ స్పష్టం చేశారు. మచిలీపట్నం నగర కార్పొరేషన్ పరిధిలోని నలభై ఐదవ డివిజన్ సిడింబి అగ్రహారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో అరాచకం, విధ్వంసానికి గురైన దేవాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగాయని, ముఖ్యంగా కృష్ణాజిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో బీచ్ వద్ద ఏర్పాటు చేసిన అరవై మూడు అడుగుల గణనాథుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు.
గతంలో దేవాలయాలపై జరిగిన దాడులు, అపవిత్రతలను సరిదిద్దుతూ తిరుమల శ్రీవారి లడ్డుతో పాటు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ప్రసాదాల తయారీని కూటమి ప్రభుత్వం పగడ్బందీగా అమలు చేస్తోందని నేతలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు సుపరిపాలనపై నమ్మకంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు భక్తుల రాక డెబ్బై శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. విఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా ఆలయాలలో నిత్య అన్నదానం ద్వారా రోజుకు వేలాది మందికి నాణ్యమైన ప్రసాదం అందిస్తున్నామని చెప్పారు. ఆలయ భూముల పరిరక్షణ, డిజిటలైజేషన్ మరియు ఆధునిక టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవ వేతనాన్ని పది వేల రూపాయలకు పెంచడంతో పాటు, నిరుద్యోగ వేద పండితులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల భజన మందిరాల నిర్మాణం, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తెవడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను హరిత పుష్కరాలుగా అద్భుతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవాడ ఉత్సవ్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో, సర్వమత సామరస్యాన్ని ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పరస వాసు తదితరులు పాల్గొన్నారు.
Slug: kootami-government-golden-era-spiritual-sector-machilipatnam
