రచన: జన గళం విజయవాడ బ్యూరో: జాతీయ కాపునాడు అధ్యక్షులు దివంగత శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి సంతాప సభ కార్యక్రమం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ (A+ Convention) సెంటర్‌లో అత్యంత భావోద్వేగపూరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి కాపునాడు నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, సామాజిక వేత్తలు మరియు అసంఖ్యాక అభిమానులు తరలివచ్చారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి చేతులు జోడించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖులు.. సమాజంలో బడుగు, బలహీన, కాపు వర్గాల సంక్షేమానికి, వారి హక్కుల సాధనకు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు చేసిన నిరంతర సేవలను, నాయకత్వ పటిమను స్మరించుకున్నారు. జీవితాంతం ప్రజా సమస్యలపై పోరాడిన ఆయన లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చూపిన సమైక్యతా మార్గంలో పయనిస్తూ, ఆయన ప్రారంభించిన ఉద్యమ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని సభలో పాల్గొన్న ప్రతినిధులు ఉద్ఘాటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
