జన గళం విజయవాడ తూర్పు/గన్నవరం బ్యూరో: పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలోని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో నిరుపేదలకు, నిరుద్యోగ యువతకు మరియు మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ఆటోలు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ విశేష సేవా కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీ పొదిలి దుర్గారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మిశెట్టి వాసు గారితో కలిసి లబ్ధిదారులకు ఆటోలు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా పొదిలి దుర్గారావు మాట్లాడుతూ.. పేద కుటుంబాలు స్వశక్తితో నిలబడేందుకు స్వయం ఉపాధి పరికరాలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి ప్రజాసేవా దృక్పథానికి అనుగుణంగా అమ్మిశెట్టి వాసు చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. ఉపాధి పరికరాలు అందుకున్న లబ్ధిదారులు ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
