జన గళం బ్యూరో: గత పదిహేనేళ్లుగా సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చెరుకుమిల్లి గ్రామ ప్రజల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామంలో దశాబ్దానికి పైగా ఎదురుచూస్తున్న ప్రధాన రహదారికి మోక్షం లభిస్తూ, గురువారం నూతన బీటీ (BT) రోడ్డు నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణానికి అవసరమైన కంకర లెవలింగ్ పనులు, రోలర్లు, ట్రాక్టర్లు మరియు భారీ యంత్రాల సహాయంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
వర్షాకాలం వస్తే బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర అవస్థలు పడేవారమని, అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందక ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యను గుర్తించి వెంటనే నిధులు మంజూరు చేసి బీటీ రోడ్డు పనులను ప్రారంభించడంపై స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ప్రజాప్రతినిధులు సూచించారు.
