జన గళం పెడన/కృష్ణా బ్యూరో: “వేగం.. వ్యూహం.. వీరోచితం” అనే నినాదంతో భారత సరిహద్దులను, గగనతలాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న భారత వైమానిక దళ (IAF) వీరుల సేవలు వెలకట్టలేనివని పెడన నియోజకవర్గ నాయకులు శ్రీ లింగం నాగేశ్వరరావు కొనియాడారు. భారత వైమానిక దళ దినోత్సవం (Indian Air Force Day) సందర్భంగా ఆయన దేశ రక్షణలో అసువులు బాసిన వీరులకు నివాళులర్పిస్తూ, సైనిక యోధులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా లింగం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల వేళ ఆపన్నహస్తం అందించడంలోనూ, శత్రు మూకల దుశ్చర్యలను తిప్పికొట్టడంలోనూ భారత వాయుసేన ప్రదర్శించే అసమాన ధైర్యసాహసాలు యావత్ భారతావనికే గర్వకారణమని పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు నిస్వార్థంగా సేవలందిస్తున్న వైమానిక దళ జవాన్లకు ప్రతి భారతీయుడూ నిరంతరం రుణపడి ఉంటారని అన్నారు. భరతమాత రక్షణలో నిలిచిన గగనతల యోధులందరికీ సెల్యూట్ చేస్తూ జైహింద్ నినాదాలు చేశారు.
