జన గళం అవనిగడ్డ/కోడూరు బ్యూరో: విద్యార్థుల సంపూర్ణ శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి అయోడిన్ కలిగిన పోషకాహారం ఎంతో అవసరమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా కోడూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ అయోడిన్ లోప నివారణ కార్యక్రమం (NIDDCP – National Iodine Deficiency Disorders Control Programme) పై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ విజయకుమార్ మాట్లాడుతూ.. శరీరంలో అయోడిన్ లోపిస్తే గాయిటర్, థైరాయిడ్ సమస్యలు, శారీరక మరుగుజ్జుతనం మరియు జ్ఞాపకశక్తి మందగించడం వంటి తీవ్ర రుగ్మతలు వచ్చే అవకాశముందన్నారు. పెరుగుతున్న వయస్సులో విద్యార్థులకు అయోడిన్ అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ వంటలలో నాణ్యమైన అయోడైజ్డ్ ఉప్పును మాత్రమే ఉపయోగించేలా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ జి. కోటేశ్వరరావు, ఎంఎల్ హెచ్‌పీ గంగారత్నం, దీపిక, ఏఎన్ఎంలు జి. నాగమణి, పి. గంగాభవాని, హెల్త్ అసిస్టెంట్లు అప్పికట్ల తారక మస్తాన్, బి. వీరాస్వామిలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
