జన గళం పెడన/కృత్తివెన్ను బ్యూరో: భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కృత్తివెన్ను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు. మండలంలోని 15 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మోదీ జీవిత చరిత్ర, ప్రజాసేవపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను విజయవంతంగా చేపట్టారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుక్రవారం లక్ష్మీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో “సర్వ అభియాన్” పేరిట ఘనంగా బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మంగళగిరిలో అత్యవసర మీడియా సమావేశం ఉన్న కారణంగా రాలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూనసాని రత్నారావు తెలిపారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండల నాయకులందరం కలిసి కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రధాని మోదీ సేవా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రత్నారావు ఆకాంక్షించారు.
