జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘ ఎన్నికల సమరంలో కూటమి శ్రేణులు ప్రచార జోరును పతాక స్థాయికి చేర్చాయి. పట్టణ పరిధిలోని పదిహేడవ వార్డులో ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని శ్రీమతి సయ్యద్ ఫర్వా గారి గెలుపును కాంక్షిస్తూ భారీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు శ్రీ అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారు, శ్రీ లింగం నాగేశ్వరరావు గారు, శ్రీ వికృతి శ్రీనివాస్ బాబు గార్లతో పాటు కూటమిలోని తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
వార్డులోని ప్రతి వీధిలో ఇంటింటికీ తిరుగుతూ సాగిన ఈ ప్రచార యాత్రకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అభ్యర్థిని సయ్యద్ ఫర్వా గారికి కాలనీవాసులు, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు స్థానిక ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు సమగ్ర అభివృద్ధి, అంతర్గత రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ కూటమి అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందించే నిబద్ధత గల అభ్యర్థిని ఆశీర్వదించాలని నాయకులు కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
