జనగళం 24 ప్రత్యేక డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మునుపెన్నడూ లేని సరికొత్త ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తున్నాయి. కేవలం ధ్వనివర్ధకాల్లో రికార్డెడ్ సినిమా పాటలు, పరిమిత వినోద వేడుకలకు వేదికలుగా ఉండే గణపతి మండపాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ, సాంస్కృతిక విలువలపై ఇచ్చిన స్పష్టమైన పిలుపుతో తెలుగు లోగిళ్లలో, నవరాత్రి పందిళ్లలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. ప్రతి వీధిలోనూ గణపతి మండపం ఇప్పుడు పవిత్ర ఆలయ వాతావరణాన్ని తలపిస్తూ భక్తి, భారతీయ సంస్కృతికి అసలైన కేంద్ర బిందువుగా మారింది.
చిన్నారులు, యువత, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిత్యం భక్తి గీతాలాపనలు, సమష్టి భజనలు, గణపతి అధర్వశీర్ష పఠనాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గతంలో వినోదానికే పరిమితమైన యువత నేడు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజాదికాలలో చురుగ్గా పాలుపంచుకోవడం సమాజంలో వస్తున్న సానుకూల మార్పునకు అద్దం పడుతోంది. పండుగలంటే కేవలం ఆడంబరాలు మాత్రమే కాదని, మన అపురూప సంస్కృతి, జీవన విలువలను భావి తరాలకు అందించే అద్భుతమైన మార్గాలని నిరూపిస్తూ ఈ ఏడాది ఉత్సవాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి.
