జనగళం 24 ఆంధ్ర డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘ కార్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ కార్యాలయం కాస్తా కొందరు ఉద్యోగుల సొంత అవసరాల కోసం వినియోగించబడుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పురపాలక కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్లానింగ్ సెక్రటరీ, తన వ్యక్తిగత ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనానికి రోజూ కార్యాలయంలోని ప్రభుత్వ విద్యుత్‌ను వినియోగించి ఛార్జింగ్ పెట్టుకుంటుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత కొంతకాలంగా నిరాటంకంగా ఈ తంతు సాగుతున్నప్పటికీ, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పట్టపగలే ప్రభుత్వ నిధులతో సరఫరా అవుతున్న విద్యుత్‌ను వ్యక్తిగత వాహనాలకు వాడుకుంటున్నా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు (టీపీవో) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాధనం, ప్రభుత్వ వనరులను ఇలా స్వార్థ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని నూజివీడు పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
