జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ దిశానిర్దేశం మేరకు, తిరుపతి జిల్లా కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ డివిజన్ల ఆర్డీవోలు, డీపీవో, జెడ్పీ డిప్యూటీ సీఈవో తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేయాల్సి ఉన్నందున అధికారులు పూర్తి సమన్వయంతో, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో మేయర్, చైర్‌పర్సన్ స్థానాలకు నేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, టెండర్ల ప్రక్రియను ముందుగానే సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందే అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలు మరియు ప్రధాన రూట్లను క్షేత్రస్థాయిలో గుర్తించి తుది జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా, సబ్-డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతి ప్రాంతంలో తప్పుడు ప్రచారాలు, వదంతుల వ్యాప్తిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృతంగా వీడియో గ్రాఫీ మరియు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Slug: tirupati-local-body-elections-review-collector-venkateswar-sp-subbarayudu
