రాయచోటి: అన్నమయ్య జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే కోడిగుడ్లు, చిక్కీల పంపిణీలో అవినీతికి పాల్పడిన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌ఎఫ్‌ఐ (USFI), ఏఐఎస్‌పీ (AISP) విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. రాయచోటి నేతా సర్కిల్ ఎదురుగా ఉన్న జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం వారు నల్ల రిబ్బన్లు ధరించి, చెవుల్లో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు.
ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలి ఈ సందర్భంగా ఏఐఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లవకుమార్, యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ.. డీఈవోపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కింది స్థాయి అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. జిల్లా లేదా రాష్ట్ర స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించే పథకానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒకే అధికారికి మూడు బాధ్యతలా? జిల్లా డీఈవోగా ఉన్న అధికారి.. అదనంగా మదనపల్లె డిప్యూటీ డీఈవోగా, డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు ఏకకాలంలో నిర్వహించడం వల్ల విద్యాశాఖలో పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, పారదర్శకత లోపిస్తోందని నాయకులు విమర్శించారు. డైట్ కళాశాలకు సంబంధించి సిబ్బంది నుంచి ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదులపైనా తక్షణమే విచారణ జరపాలన్నారు. ఆరోపణలు రుజువైతే సంబంధిత అధికారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు గణేశ్ రాయల్, శెట్టిపల్లి సాయి హేమంత్, మనోజ్, అఫ్రీద్, శోహిల్ తదితరులు పాల్గొన్నారు.
SLUG: USFI and AISP leaders protest in Rayachoti demanding the suspension of the Annamayya district DEO over alleged corruption in the distribution of eggs and chikkis.
