రచన: మహమ్మద్ రఫీ, జన గళం పెడన డెస్క్: విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని పెడన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దుండగుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ‘వార్త’ దినపత్రిక పెడన రిపోర్టర్ తాతా విఠల్‌ను మంగళవారం పెడన ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు ఆత్మీయంగా పరామర్శించారు.
గాయపడిన విఠల్ ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న ప్రెస్ క్లబ్ నాయకులు ఆయనకు మనోధైర్యాన్ని చెప్పారు. జర్నలిస్టుల రక్షణకు ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే జర్నలిస్టులపై ఇలాంటి భౌతిక దాడులు చేయడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెడన ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
