రచన: మల్లికార్జున్, జన గళం ఉయ్యూరు డెస్క్: కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ అక్రమ లేఅవుట్ల దందా యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పచ్చని వ్యవసాయ భూములను ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లుగా మార్చేసి అమాయక ప్రజలకు అంటగడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉయ్యూరు సమీపంలోని సుమారు 9 ఎకరాల విస్తీర్ణంగల వ్యవసాయ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ లేఅవుట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాలా (NALA) కన్వర్షన్ ట్యాక్స్ సైతం చెల్లించకుండా ఇప్పటికే 20కి పైగా ప్లాట్లను విక్రయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు సమీపంలోని గద్దలమారి గుంట చెరువు భూములను ఆక్రమించి రోడ్ల నిర్మాణం చేపట్టడం, భవిష్యత్ అవసరాల కోసం వదిలేయాల్సిన కామన్ సైట్లను సైతం ప్లాట్లుగా మార్చి విక్రయిస్తుండటం తీవ్ర దుమారం రేపుతోంది. సమీపంలోని టిడ్కో ఇళ్ల పరిసరాలను చూపిస్తూ ఆకర్షణీయమైన బ్రోచర్లతో పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్నారని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా కపిలేశ్వరపురం గ్రామ పంచాయతీ, పమిడిముక్కల మండల రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి చెరువు పరిరక్షణతో పాటు అక్రమ వెంచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
