రచన: జన గళం అమరావతి డెస్క్: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు కేంద్ర ఆర్థిక సంఘం నిధులను కోల్పోవాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో 23 మున్సిపాలిటీలకు సమయానికి ఎన్నికలు నిర్వహించకుండా వదిలేయడం వల్ల స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు నిలిచిపోయాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మొత్తం 123 మున్సిపాలిటీలలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని మంత్రి వెల్లడించారు. ఎన్నికలు నిర్వహించి స్థానిక పాలకవర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా నిలిచిపోయిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పూర్తిస్థాయిలో రాబట్టి, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థలు, రహదారుల అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని, కూటమి ప్రభుత్వంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా నగరాలు, పట్టణాల రూపురేఖలను మారుస్తామని మంత్రి నారాయణ తేల్చిచెప్పారు.
