జన గళం విజయవాడ డెస్క్: విజయవాడ నగరంలో జనసేన పార్టీ అపూర్వ సేవా, రాజకీయ కార్యక్రమానికి వేదిక సిద్ధమైంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గ మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు స్వయం ఉపాధి కల్పించే బృహత్తర కార్యక్రమం ఈనెల 7వ తేదీ బుధవారం (07-10-2026) ఉదయం 9:30 గంటలకు బందరు రోడ్డులోని ‘సుజనా ది వేన్యూ’ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నిస్వార్థంగా జెండా మోస్తూ కష్టపడుతున్న ఆటో కార్మికులైన జనసైనికులకు ఆటోలు, వీధి చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, వీర మహిళల స్వయం సమృద్ధి కోసం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టనున్నారు. అదే వేదికపై ఇతర ప్రధాన పార్టీల నుంచి పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు, ఏపీ గ్రీనింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు హాజరుకానున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను విశిష్ట అతిథులుగా విచ్చేస్తారు. వారితో పాటు ఏపీ ఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కేకే), ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్, సీనియర్ రాష్ట్ర నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు పాల్గొంటారు. విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల నాయకులు, డివిజన్ అధ్యక్షులు, క్రిష్ణ-పెన్నా రీజినల్ కోఆర్డినేటర్లు, అమ్మవారి ధార్మిక మండలి ప్రతినిధులు, వీర మహిళలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయవాడ జనసేన పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది.
