జన గళం ఏలూరు/పశ్చిమ గోదావరి బ్యూరో: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు బీసీవై పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో విజయవంతంగా కొనసాగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నూతన చేరికలు, గ్రామ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగం బలోపేతం మరియు భవిష్యత్ కార్యాచరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలపై సమగ్రంగా చర్చించారు. గోదావరి వరదల వల్ల నదీ తీర కరకట్టలు బలహీనపడటం, విచ్చలవిడి అక్రమ ఇసుక తవ్వకాలతో తీర ప్రాంతాలు కోతకు గురికావడం, తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతుల దుస్థితి, నదీ జలాల కాలుష్యం, తాగునీటి ఎద్దడి, ప్రభుత్వ మరియు దేవాలయ భూముల ఆక్రమణలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే యువత భవిష్యత్తును చిదిమేస్తున్న సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (NH 165) విస్తరణలో భాగంగా గోపవరం–అగ్రహారం బైపాస్ రోడ్డు పనుల్లో నెలకొన్న తీవ్ర జాప్యాన్ని ప్రస్తావించారు. ఈ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, స్పందించకపోతే క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పార్టీ తీర్మానించింది.
అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఫేక్ జీవోలతో మభ్యపెట్టి మోసం చేశారంటూ సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీసీవై పార్టీ శ్రేణులు ఏలూరు లేడీస్ క్లబ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ బీసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తామని నేతలు స్పష్టం చేశారు.
