జన గళం అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సమరానికి సంబంధించి అధికార కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ ఆసక్తికర మలుపు తిరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, వార్డులు, మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపులపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రాథమిక చర్చలు జరిపిన అనంతరం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు తదితర సమన్వయ కమిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటులో చోటుచేసుకుంటున్న పరిణామాలు, మిత్రపక్షాల డిమాండ్లను సీఎంకు నివేదించారు.
జనసేన పార్టీ తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 నియోజకవర్గాల పరిధిలో చైర్మన్ పదవులతో పాటు, కనీసం 50 శాతం వార్డులు, డివిజన్లు, ఎంపీటీసీ స్థానాలను కేటాయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, రాష్ట్రవ్యాప్తంగా గతంలో చర్చకు వచ్చిన 15 శాతం సీట్ల కేటాయింపు ఫార్ములాకే పరిమితం కావడంపై క్షేత్రస్థాయి జనసైనికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జనసేన ఎమ్మెల్యేలు లేని మిగతా 154 నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ విస్తరణ, ప్రాతినిధ్యం ఎలా ఉంటుందనే అంశంపై చర్చ మొదలైంది. మరోవైపు, తమకు ప్రాతినిధ్యం లేని ప్రాంతాల్లోనూ ఉనికి చాటుకునేందుకు చైర్మన్, కార్పొరేటర్ స్థానాలు కావాలని బీజేపీ పట్టుబడుతున్న విషయాన్ని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. స్థానిక వ్యూహాలు, అంతర్గత అసంతృప్తులకు తావులేకుండా సీట్ల కేటాయింపును పూర్తి చేసేందుకు కూటమి రాష్ట్ర స్థాయి కీలక సమావేశాలు కొనసాగనున్నాయి.
