జన గళం రాజకీయ బ్యూరో/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల సమరానికి సంబంధించి అధికార కూటమిలో కీలక మున్సిపల్ కార్పొరేషన్ల స్థానాల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 నగరపాలక సంస్థలలో (మున్సిపల్ కార్పొరేషన్లు) తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య పరస్పర అవగాహనతో సీట్ల కేటాయింపు ఫార్ములా ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తం 17 కార్పొరేషన్లలో 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 5 కీలక నగరాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను మేయర్ బరిలో నిలపనున్నట్లు ప్రాథమిక ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఈ సర్దుబాటు ప్రకారం జనసేన పార్టీకి విజయవాడ, తిరుపతి, కాకినాడ, ఒంగోలు, మచిలీపట్నం వంటి కీలక రాజకీయ, వాణిజ్య ప్రాధాన్యత కలిగిన 5 కార్పొరేషన్లు దక్కాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, ఏలూరు, విజయనగరం, చిత్తూరు, శ్రీకాకుళంలతో పాటు మిగిలిన నగరాల్లో తమ నాయకత్వాన్ని నిలపనుంది. ప్రధాన నగరాలైన విజయవాడ, తిరుపతి జనసేనకు కేటాయించడంపై జనసైనికుల్లో హర్షం వ్యక్తమవుతుండగా, క్షేత్రస్థాయిలో కూటమి ఓట్లు సమన్వయమై క్లీన్ స్వీప్ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
