జన గళం కృత్తివెన్ను/పెడన బ్యూరో: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ–3.0’ కార్యక్రమంలో భాగంగా గురువారం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం మునిపెడ గ్రామంలో రూ.14.5 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు కూటమి నాయకులు ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ప్రత్యేక కృషితో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సమన్వయంతో పల్లెలు ప్రగతి బాట పట్టాయని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల ప్రతినిధులు, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, పంచాయతీ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
