జన గళం హైదరాబాద్ బ్యూరో: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా పుట్టిన నేల మీద మమకారం, తోటి ప్రాణాలను కాపాడాలనే సేవా సంకల్పం చెక్కుచెదరలేదని నిరూపించారు ప్రవాస భారతీయుడు శ్రీ రాయుడు వెంకటేశ్వరరావు. మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న ఆయన గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ నుంచి గురువారం ఉదయం హైదరాబాద్ నగరానికి చేరుకున్న వెంటనే నేరుగా జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఐ & బ్లడ్ సెంటర్‌కు (CCT) వచ్చి స్వచ్ఛందంగా 12వ సారి రక్తదానం చేశారు.
గతంలో భారతదేశంలో ఉన్న సమయంలో ఎన్నోసార్లు రక్తదానం చేసిన వెంకటేశ్వరరావు, బహ్రెయిన్ వెళ్లిన తర్వాత కూడా అక్కడే రక్తదాన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సుదూర తీరాల నుంచి విమానం దిగిన వెంటనే అలసటను సైతం లెక్కచేయకుండా నేరుగా బ్లడ్ బ్యాంక్‌కు వచ్చి రక్తదానం చేయడం ఆయనలోని సేవా నిబద్ధతకు, ఉన్నతమైన మానవత్వానికి నిదర్శనమని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు కొనియాడారు. తెలుగు వారి ఔన్నత్యాన్ని, సేవా గుణాన్ని గల్ఫ్ గడ్డపై సైతం చాటుతున్న రాయుడు వెంకటేశ్వరరావును ట్రస్ట్ నిర్వాహకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
