జన గళం విజయవాడ బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (FDC) వైస్ చైర్మన్, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ గురువారం దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభానుతో కలిసి ఆయన ఆలయానికి విచ్చేసి అమ్మవారికి, శ్రీ మల్లేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న మెహర్ రమేష్, సామినేని ఉదయభానులకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. వేద పండితులు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమార్ నాని, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, సెంట్రల్ నాయకులు పందిరి వాసుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
