జన గళం కృత్తివెన్ను/పెడన బ్యూరో: “మత్స్యకార సేవలో కూటమి ప్రభుత్వం” నినాదంతో తీరప్రాంత మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం దీవిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. జూన్ నెలలో వేట నిషేధ కాలంలో అందించిన రూ. 20 వేల ఆర్థిక సాయం, పడవలకు ఇస్తున్న డీజిల్ సబ్సిడీతో పాటు, మత్స్యకార సోదరులకు నూతనంగా మంజూరైన బోట్ లైసెన్స్ పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సముద్రపు వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం బంటుమిల్లి ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషకాహార ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ కార్యకర్తల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, మత్స్యశాఖ, ఐసీడీఎస్ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
