జన గళం అమరావతి/మంగళగిరి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ సర్వసన్నద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలం, జనసైనికుల సంసిద్ధత, ఎన్నికల వ్యూహాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి నివేదించేందుకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అడ్ హాక్ కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం (08-10-2026) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ కమిటీల రూపకల్పనను శ్రీ పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల ఆధారంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కమిటీలకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించారు. గురువారం సాయంత్రం కమిటీల వివరాలను సమగ్రంగా సమీక్షించిన అనంతరం.. విజయవాడ పార్లమెంట్ మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల జాబితాను శుక్రవారం అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ కమిటీలు గ్రౌండ్ లెవల్ నుంచి వాస్తవ సమాచారాన్ని సేకరించి అధినేతకు నేరుగా సమగ్ర నివేదికలు అందించనున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా ఈ కోఆర్డినేషన్ కమిటీలు పనిచేస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.
