జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా పెడన పురపాలక సంఘంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ ఊపందుకుంది. పరిపాలనా సౌలభ్యం మరియు జనాభా ప్రాతిపదికన పెడన మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు వార్డుల స్థానంలో కొత్తగా ఇరవై ఎనిమిది వార్డులుగా పునర్విభజించేందుకు పురపాలక పరిపాలన శాఖ డైరెక్టర్ మరియు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వార్డుల సరిహద్దుల మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసి అధికారిక పరిశీలనకు ఉంచారు.
పునర్విభజన ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక ప్రజల సమాచారం, పరిశీలన నిమిత్తం పలు కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు తహశీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, స్థానిక పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులపై ఈ వివరాలను ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ ముసాయిదాను పరిశీలించి వార్డుల సరిహద్దులు, వివరాలపై అవగాహన చేసుకోవాలని సూచించారు.
