జన గళం నియోజకవర్గ డెస్క్: కృష్ణా జిల్లా పరిధిలోని చిన్న గొల్లపాలెం సచివాలయం-1 పరిధిలోని 10వ వార్డులో గత నెల రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. బాలికల హాస్టల్ పరిసర ప్రాంతాలు, 10వ వార్డులోని ఇళ్లకు నెల రోజులకు పైగా కుళాయిల ద్వారా సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై గ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS) ఏఈ, వాటర్ మ్యాన్, స్థానిక సచివాలయ సిబ్బందికి పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక నాయకుడు తెలగం శెట్టి ఏడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో కనీసం తాగేందుకు కూడా నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఈ సమస్యను నేరుగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని హెచ్చరించారు.
చిన్న గొల్లపాలెంలో నెల రోజులుగా నిలిచిన తాగునీరు: అధికారులు స్పందించకపోతే ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక!
