జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా గూడూరు మండలంలో సాగుతున్న ఈ-పంట నమోదు ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతి రమణి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. పంటల నమోదు తీరును నిశితంగా పరిశీలించిన అధికారులు, స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన రైతులందరూ ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు, పంట నష్టపరిహారం పొందాలంటే విధిగా ఈ-పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.
మండలంలో ఇప్పటివరకు ఏడు వేల ఎనిమిది వందల హెక్టార్లలో ఈ-పంట నమోదు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నేరుగా ఫార్మర్ ఐడీతో అనుసంధానం చేసినందున, ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ నమోదు చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. శివరామకృష్ణ, గ్రామ వ్యవసాయ సహాయకులు పూజ ప్రియదర్శిని, షేక్ నీలోఫర్, సుకన్యతో పాటు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
