జన గళం భక్తి డెస్క్: బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజున జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారు భక్తులకు విశేషమైన “శ్రీ మహాచండీ దేవి” అలంకారంలో దివ్య దర్శనమిచ్చారు. శత్రు సంహారకారిణిగా, దుష్టశక్తుల నివారిణిగా మరియు సకల కార్యసిద్ధిని ప్రసాదించే అవతారంగా వెలుగొందే మహాచండీ దేవిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విజయవాడకు పోటెత్తారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఘాట్ రోడ్డు మార్గంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి పాలకమండలి, పోలీస్ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశాయి. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, నిరంతర అన్నదానం, ఉచిత తాగునీరు, అత్యవసర వైద్య శిబిరాలను ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భవానీ భక్తులు, మహిళా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనాన్ని సులభతరం చేశారు.
