జన గళం ఆధ్యాత్మిక డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల వేళ శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఈ భారీ రద్దీని నియంత్రించి, సాధారణ భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గర్భాలయం వద్ద రద్దీ పెరగడంతో అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
అంతరాలయ దర్శనం నిలిపివేయడంతో భక్తులందరినీ లఘు దర్శనం ద్వారా అమ్మవారిని దర్శించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనివల్ల క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గి, వేలాది మంది భక్తులకు సజావుగా దర్శనం లభిస్తుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఘాట్ రోడ్డు నుంచి ఆలయ పరిసరాల వరకు భద్రతా సిబ్బంది, పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులను క్రమపద్ధతిలో ముందుకు పంపుతున్నారు.
