జన గళం తిరువూరు డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎంపిక కూటమిలో చిలికి చిలికి గాలివానలా మారుతోంది. రాష్ట్ర స్థాయిలో కుదిరిన పొత్తు ఒప్పందాల ప్రకారం తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించగా, పార్టీ తరఫున నిబద్ధత గల సీనియర్ మహిళా నేత పి. మాధవి గారిని అధికారిక అభ్యర్థిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే, అధిష్టానం నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా పెట్టిన వాట్సాప్/ఫేస్‌బుక్ స్టేటస్ తిరువూరు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
జనసేన అభ్యర్థి సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ కొలికపూడి పెట్టిన స్టేటస్‌పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. టీడీపీ తరఫున నాగ శ్రావణిని రంగంలోకి దించుతూ ఇప్పటికే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కొలికపూడి, ఇప్పుడు జనసేన అభ్యర్థి నేపథ్యంపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం కూటమి శ్రేణుల్లో అగ్గి రాజేసింది. 12 ఏళ్లుగా జెండా మోసిన బీసీ మహిళా నాయకురాలికి పవన్ కళ్యాణ్ సముచిత గుర్తింపునిస్తే, స్థానిక ఎమ్మెల్యే మాత్రం సామాజిక సమీకరణాలను సాకుగా చూపి కూటమి పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో కూటమి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకోవాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.
Slug: tiruvuru-mla-kolikapudi-srinivasa-rao-status-sparks-row-over-janasena-bc-candidate-madhavi
