జన గళం కళా డెస్క్: తెలుగు వారి ప్రాచీన శాస్త్రీయ నృత్య కళారూపమైన కూచిపూడి రంగంలో సరికొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. ‘స్పందన నృత్య కేళి వరల్డ్ రికార్డ్ అటెంప్ట్’ కార్యక్రమంలో భాగంగా 12 ఏళ్ల బాలిక బేబీ రుంకీ వైష్ణవి తన అసమాన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది. అపారమైన భక్తి ప్రపత్తులు, కఠోర సాధన, తిరుగులేని క్రమశిక్షణతో ఆమె ప్రదర్శించిన నృత్య రీతులు కళాకారులను, వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
”గాన నృత్యం: ఎ టేల్ ఆఫ్ సేక్రెడ్ స్టెప్స్” పేరిట నిర్వహించిన ఈ విశేష కార్యక్రమంలో వైష్ణవి ఏకధాటిగా 12 కిలోమీటర్ల నాన్‌స్టాప్ కూచిపూడి వాక్‌థాన్ నిర్వహించి శారీరక, మానసిక పట్టుదలను చాటిచెప్పింది. అంతేకాకుండా 122 విభిన్న గణపతి స్వరూప భంగిమలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించడమే కాక, 522 గణేశ గీతాల ఆలాపనతో కూచిపూడి సౌందర్యాన్ని విశ్వవేదికపై సగర్వంగా నిలబెట్టింది. ఒకే వేదికపై ఏకకాలంలో 12 ప్రపంచ రికార్డులను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ ప్రదర్శన తెలుగు సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని కళా ప్రముఖులు కొనియాడారు. ఇంతటి చిన్న వయసులోనే అరుదైన మైలురాయిని అధిగమించిన వైష్ణవిని పలువురు ప్రముఖులు హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు.
