జన గళం తిరువూరు/ఎన్టీఆర్ జిల్లా డెస్క్: తిరువూరు మున్సిపల్ ఎన్నికల పోరులో ఊహాగానాలకు, అంతర్గత వివాదాలకు తెరదించుతూ జనసేన పార్టీ అధిష్టానం కీలక ముందడుగు వేసింది. తిరువూరు నగర పంచాయతీ/మున్సిపాలిటీ ఎన్డీయే కూటమి అధికారిక చైర్మన్ అభ్యర్థిని శ్రీమతి పి. మాధవి గారికి జనసేన పార్టీ అధికారిక ‘బి-ఫామ్’ను లాంఛనంగా అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల సమక్షంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రతినిధులు ఈ బి-ఫామ్‌ను మాధవి గారికి అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసి ప్రజాసేవలో ఉన్న నిబద్ధత కలిగిన మహిళా కార్యకర్తకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చి అండగా నిలిచిన జనసేనాని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పొత్తు ధర్మానికి అనుగుణంగా తమ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, బీజేపీ కూటమి ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తిరువూరు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని ఉధృతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
